30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన తెలంగాణ
ఏపీలో 34 నెలలుగా కొత్త జీతాలు పెండింగ్
2018లో 11వ పీఆర్సీ ఏర్పాటు
గత అక్టోబరులో నివేదిక సమర్పణ
8 నెలలుగా నాన్చుతున్న సర్కారు
ఉద్యోగులకు ‘ఐఆర్’తో సరి
నష్టపోతున్న రిటైర్డ్ ఉద్యోగులు
పెండింగ్ డీఏలపైనా గందరగోళం
ప్రశ్నించలేని పరిస్థితిలో సంఘాలు
అయోమయ స్థితిలో ఉద్యోగులు
(అమరావతి – ఆంధ్రజ్యోతి)
‘‘వేతన సవరణ ఎప్పుడు? కొత్త జీతాలు ఎప్పుడు అందుకుంటాం!?’’… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడు ఇదే చర్చ. పొరుగున తెలంగాణ ప్రభుత్వం 30శాతం ఫిట్‌మెంట్‌తో జూలై 1 నుంచి పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో… ఏపీలోనూ పీఆర్సీ అమలుపై చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ప్రకటించి తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ ఉద్యోగులకు చట్టపరంగా దక్కాల్సిన పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 11వ వేతన సవరణ 2018 జూలై నుంచే అమలులోకి రావాలి. కమిషన్ చైర్మన్ అశుతో్‌షమిశ్రా గత ఏడాది అక్టోబరు ఐదో తేదీన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత కొన్నాళ్లకైనా ప్రభుత్వం.. పీఆర్సీ ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయినా, ఎదురుచూపులే మిగిలాయి. పీఆర్సీ ఆలస్యమయ్యే కొ ద్దీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మ రీ ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు భారీ గా ప్రయోజనాలు కోల్పోతారు.
అక్టోబరు నుంచీ ఎదురుచూపులే..
2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. దీంతో… వారి కంటే ఏపీ ఉ ద్యోగులకు జీతాలు తక్కువ ఉండటం సమంజసం కాదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉ న్నా చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. 10 నెలల బకాయిలూ చెల్లించారు. ఆ తర్వాత… 2018 మే నెల లో 11వవేతన సవరణ కమిషన్‌ను నియమించింది. కనీసం 55 శాతం ఫిట్‌మెంట్ ఇ వ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఇక రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ 63 శాతం…కనీస జీతం రూ. 25 వేలు.. ఇంక్రిమెంట్ 3 శాతం… పెన్షన్ రూ.6,500 నుంచి 12,500 పెంచాలని డిమాండ్ చేశాయి. కమిషన్ ఏడాదిలోపు తన నివేదికను ఇవ్వాల్సి ఉంది. కానీ… ఆరు దఫాలు గడువు పొడిగిస్తూ వచ్చారు. చివరకు గత ఏడాది అక్టోబరులో కమిషన్ తన నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి దీనిపై సర్కారులో ఉలుకూ పలుకూ లేదు.
IR తో సరి…
పీఆర్సీ పెండింగ్‌లో ఉండటంతో 2019 జూలైలో జగన్ సర్కారు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పీఆర్సీపైనా జగన్ ఇదే తరహాలో శరవేగంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ… పీఆర్సీ గడువును మళ్లీ మళ్లీ పొడిగించారు. చివరికి… కమిషన్ నివేదిక అందినప్పటికీ దానిని అమ లు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై నుంచి వ రుసగా మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత కొత్త డీఏలు ప్రకటించకుండా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అది లేకపోతే… ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు రావాల్సి ఉంది. మొత్తం ఐదు సంగతి పక్కనపెట్టినా, మొదటి మూడు డీఏలకు ఇప్పటికీ దిక్కులేదు. మూడు డీఏలను విడతల వారీగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూలు ఇచ్చింది. దీని ప్రకారం జనవరిలో ఒక డీఏ పడాలి. ఇది ఉద్యోగుల్లో కొందరికి మాత్రమే వస్తోంది. మిగిలిన వారికి అందడంలేదు. మొదటిదే రాకపోవడంతో… మిగిలిన రెండు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు.
చప్పుడు చేయని సంఘాలు…
మూడు డీఏ బకాయిలు ఉన్నా… కొత్త పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నా… ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ‘గుంభనం’గా వ్యవహరిస్తుండటం గమనార్హం. పొరుగు రాష్ట్రంలో పీఆర్సీ ప్రకటించిన తర్వాత కూడా సంఘాల నాయకులెవరూ పీఆర్సీ గురించి మాట్లాడటంలేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు పోరాడతామని ప్రకటించి మరీ తమ డిమాండ్లు సాధించుకునే వారు. సర్కారు మారగానే ఉద్యోగ సంఘాల వైఖరి మారిపోయింది. సమస్యలను సాటి ఉ ద్యోగుల కోణంలో కాకుండా… ప్రభుత్వం కోణం నుంచి చూడటం మొదలైంది.ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై పోరాడే సంగతి పక్కనపెట్టారు. ఇప్పటిదాకా ఉద్యోగ సంఘాలు చేసుకున్న విన్నపాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదాహరణకు… కొవిడ్ ప్రబలంగా ఉందని, ఉద్యోగుల్లో సగం మందిని వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించాలని కరోనా తొలి విడతలో ఉద్యోగులు చేసిన అభ్యర్థనను సీఎస్ తిరస్కరించారు. ఉద్యోగుల పీఆర్సీ వాయిదా వేస్తున్నా… డీఏలపై గందరగోళం ఉన్నా ష్… గప్‌చుప్! ప్రతి నెలా రిటైర్ అవుతున్న వందల ఉద్యోగులు నష్టపోతున్నా నేతలకు పట్టడంలేదు. ప్రభుత్వం ఇప్పుడైనా వేతన సవరణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని… లేనిపక్షంలో తెలంగాణ ఉద్యోగుల దృష్టిలో చులకన అవుతామని ఉద్యోగులు పేర్కొంటున్నారు.