నేడు Covid వ్యాక్సిన్‌ డ్రై రన్‌

కాకినాడ రేచర్లపేట యూపీహెచ్‌సీ, అపోలో ఆసుపత్రి ,

 ఎస్‌ఆర్‌ఎంటీ హాల్‌ ఎంపిక

  వ్యాక్సిన్‌ నిజంగా వస్తే ఎలా అందించాలనే దానిపై 

అధికారుల మాక్‌ కసరత్తు

కాకినాడ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ మహమ్మారి పీకమణిచే వ్యాక్సిన్‌ను త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తే దాన్ని ప్రజలకు ఎలా అందించాలి? సరఫరాలో తలెత్తే సమస్యలు ఏంటి? అనేది తెలుసుకోవడంలో భాగంగా శనివారం వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. ఇందుకోసం జిల్లా కేంద్రం కాకినాడలో మూడు ప్రాంతాల్లో ఎంపిక చేసిన హెల్త్‌వర్కర్లను ఉంచి ఈ డ్రైరన్‌ చేపట్టనుంది గత నెల 28న కృష్ణాజిల్లాలో అధికారులు ఈ తరహా డ్రైరన్‌ చేపట్టారు. ఇప్పుడు మలిదశలో అన్ని జిల్లాల్లో శనివారం నిర్వహిస్తున్నారు. అందు లో భాగంగా కాకినాడ రేచర్లపేటలోని యూపీహెసీ, అపోలో ఆసుపత్రి, రమణయ్యపేటలోని ఎస్‌ఆర్‌ఎంటీ హాలులో ఈ డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. టీకా నిల్వ చేసే స్టోరేజీ సెంటర్‌ నుంచి టీకాలు ఇచ్చే ప్రాంతానికి వీటిని ఎలా తరలించాలి? తరలించిన తర్వాత ఒక్కొక్కరికి ఎలా అందించాలి? అనేదానిపై ఈ డ్రైరన్‌ చేపడతారు. ముందుగా సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ ఆధారంగా ఆరోజు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అనేది ఒక్కో సెంటర్‌లో అయిదుగురు సభ్యుల బృందం పరిశీలిస్తుంది. ఈ అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో నిజంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేటప్పుడు వాటిని అధిగమించేందుకు ఈ డ్రైరన్‌ ఉపయోగపడుతుందని డీఎంఅండ్‌హెచ్‌వో వివరించారు. శనివారం ఉదయం 8.30 గంటలకు దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మరోపక్క కొవిడ్‌ టీకా అధికారికంగా విడుదల చేసిన తర్వాత జిల్లాలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, కొవిడ్‌ సేవలందిస్తున్న వివిధ వర్గాల అధికారులకు కలిపి సుమారుగా 35 వేల మందికి తొలి దశలో అందించడానికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

Flash...   త్వరలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్