Transfers Confusion in Teachers

 ఏమీటీ గందరగోళం

ఉపాధ్యాయుల బదిలీల్లో ఎందుకీ రభస

దొడ్డిదారి జీవోలతో కొందరిని ఎందుకు బదిలీ చేశారు?

బ్లాక్‌ చేసిన ఖాళీలను ఓపెన్‌ చేయాలని డిమాండు చేస్తున్న ఉపాఽధ్యాయ సంఘాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయుల బదిలీల్లో గతంలో ఎన్నడూ లేని గందరగోళం, రభస ఇప్పుడు ఈ బదిలీల్లో ఎందుకు ఏర్పడింది? దొడ్డిదారి జీవోలతో కొందరిని ప్రభుత్వం బదిలీ చేయడమే దీనికంతకటికీ కారణం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని ఇతర శాఖల్లో సాధారణ బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఉపాధ్యాయులను బదిలీ చేయలేదు. కానీ అప్పటికప్పుడు కొన్ని జీవోలతో పలువురు ఉపాధ్యాయులు గుట్టుచప్పుడుగా బదిలీ అయ్యారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. ఫలితంగా ఈ ఏడాది అక్టోబరు 12న ప్రభుత్వం జీవోలు 53, 54 జారీ చేసింది. జీవో 53 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, 54 జీవో ప్రకారం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే మార్గదర్శకాలు రూపొందించే సమయంలో ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదు. ప్రభు త్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని, తద్వారా అర్హులైన వారిని తీవ్ర నష్టం ఏర్పడుతోందని సంఘాలు మరోమారు ఆందోళన బాట పట్టాయి. స్పందించిన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. తదనుగుణంగా సమావేశంలో ప్రతినిధులు బదిలీ విషయంలో పలు మార్పులు సూచించారు. దీంతో స్టేషన్‌ సీనియార్టీ 8 ఏళ్లు నిండిన ఉపాధ్యాయులు, 5 ఏళ్లు పూర్తయిన హెచ్‌ఎంలను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించారు. 2017లో ఈ పరిమితిని 8/5 విద్యా సంవత్సరాలుగా మార్చారు. అప్పట్లో దీన్ని వ్యతిరేకించి 8/5 పూర్తి సంవత్సరాలుగా ఉండాలని ప్రతిపాదించాయి. కానీ ప్రభుత్వం హెచ్‌ఎంలకు 5 ఏళ్లు పూర్తి సంవత్సరాలుగా మార్చి, ఉపాధ్యాయులకు మాత్రం 8 ఏళ్ల విద్యా సంవత్సరాలుగానే ఉంచింది. పైగా విద్యా సంవత్సరంలో సగం మించితే పూర్తి సంవత్సరంగా పరిగణిస్తున్నారు. ఇది అన్యాయమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో పని తీరు పేరుతో బదిలీలకు పాయింట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం అశాస్ర్తీయమని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. ఇప్పుడు జరిగే బదిలీల్లో పనితీరు, పాయింట్లు తొలగించారు. అయినప్పటికీ వీరు నిరాశలోనే ఉన్నారు. ప్రతీ ఏటా బదిలీలు జరగకపోవడం, జరిగినప్పుడల్లా మార్గదర్శకాలు మారుతుండడంతో వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఉపాధ్యాయులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం పోస్టుల బ్యాకింగేనని స్పష్టమవుతోంది. గత పది సంవత్సరాలుగా మారుమూల ప్రదేశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ ద్వారా ప్రయోజనం పొందుతామనుకున్నారు. కానీ సగానికి సగం పోస్టులు బ్లాక్‌ చేస్తున్నారనే విషయం వీరికి మింగుడుపడడం లేదు. పోనీ బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్లాక్‌ చేసిన ఖాళీల్లో బదిలీల్లో లబ్ధి పొందుదామని ఎదురు చూసినా, రాజకీయ జోక్యం తమకు ఆశని పాతంగా మారుతోందని వీరు మదనపడుతున్నారు. బ్యాకింగ్‌కు బదులు అన్ని ఖాళీల బదిలీలకుచూపి, నింపకుండా మిగిలిన ఖాళీలను సర్దుబాటు ద్వారా భర్తీ చేస్తే మేలని వీరు అభిప్రాయపడుతున్నారు. 

Flash...   WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

♦కర్ణాటక రాష్ట్రం మాదిరిగా..

కర్ణాటక రాష్ట్రం మాదిరిగా ఒక శాశ్వత బదిలీ కోడ్‌ ఈ రాష్ట్రంలో తీసుకురావాలని, లేకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని సంఘ నేతలు చెబుతున్నారు. అధికారుల అనాలోచిత చర్యల వల్ల ఇప్పటికే బదిలీ షెడ్యూల్‌ మూడు సార్లు వాయిదా పడిందని, ఇప్పుడున్న పరిస్థితిలో అసలు బదిలీలు జరుగుతాయో లేదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తున్న అధికారుల వ్యవహారాన్ని, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మొన్న గురువారం ఉపాధ్యాయ సంఘాలన్నీ డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు.

♦గతంలో..

రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ చేసే ఉపా ధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపుతోపాటు వారు బదిలీ కోరకుంటే అదనపు పాయింట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ సదుపాయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. బదిలీ సీనియార్టీ నిర్థారించడానికి మొత్తం సర్వీస్‌కు 0.5 పాయింట్లు చొప్పున వారు పనిచేసిన మొత్తం కాలానికి పాయింట్లు ఇచ్చే పద్ధతికి సవరణ చేసి మొత్తం 15 పాయింట్లకు పరిమితం చేశారు. ఇది గతం. తాజాగా 16.5 పాయింట్ల కు మార్చారు. ఈ క్రమంలో పనిచేస్తున్న పాఠశాల పాయింట్లు 8/5 సంవత్సరాలకు పరిమితం చేసి తదుపరి తొలగించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో విషయం ప్రస్తావిస్తే సైన్యంలో పనిచేస్తున్న, మాజీ సైనికోద్యోగుల భార్యలు కొందరు టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరికి వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వుల్లో పాయింట్లు మంజూరు చేసి, సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో వీరికి కూడా ఇప్పుడు సదరు బదిలీల్లో ప్రయోజనం లేకుండా ఉంది. ఇక కొందరు ఉపాధ్యాయులకు ఈ ఏడాది అక్టోబరు నెలలో స్కూల్‌ అసిస్టెంట్‌లుగా, హెచ్‌ఎంలుగా పదోన్నతులిచ్చారు. కానీ వారు ఎక్కడ చేరాలో సదరు స్థానాలు చూపలేదు. అయితే వారు సదరు బదిలీ స్థానంలో చేరతారా, లేదా అని అంగీకారం, అనంగీకారం లేఖ ఇవ్వాలన్నారు. దీంతో పదోన్నతి లభించిన వారు అంగీకరిస్తే ప్రస్తుత స్థానం కోల్పోతారు. తర్వాత వీరు ఎక్కడకి వెళ్లాలో తెలియదు. దీంతో పలువురు పదోన్నతులు తిరస్కరించారు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో రిటైరయ్యే ఉపాధ్యాయులకు మేలు చేయడానికి తతంగం నడిపించినా వారు రిటైరయ్యారు. కానీ వీరికి పదోన్నతి రాకపోవడం దారుణం. 

Flash...   Decision on Intermediate Education for 2020-21

♦న్యాయం కోసమే ఉద్యమం : సుబ్బరాజు, ఎస్టీయూ ఏపీ కోశాధికారి 

మా సమస్యల పరిష్కారాలపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపడమేకాక ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మా డిమాండ్లను నెరవేర్చేదని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) రాష్ట్ర కోశాధికారి సుబ్బరాజు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 2009 ఏడాది వరకు, అంతకు ముందు నెలవారీ పదోన్నతి పొందిన స్థానాల బదిలీలకు ఖాళీలు చూపేవారు. 2010 నుంచి ఆ పద్ధతికి స్వస్తి పలికారు. గడిచిన కాలంలోనూ, ఈ ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో వందలాది  మందికి పదోన్నతులు కల్పించారు. ఆ స్థానాలు ఖాళీగా చూపాలని, సీనియర్లయిన తమకు న్యాయం చేయాలని మాత్రమే ఉద్యమం చేస్తున్నామని సుబ్బరాజు పేర్కొన్నారు.