బదిలీల జాబితా కొలిక్కి

బదిలీల జాబితా కొలిక్కి

కమిషనర్‌కు పంపి అభ్యంతరాలు స్వీకరించే యోచన

ఈనాడు-గుంటూరు

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దీంతో బదిలీ దరఖాస్తులను తిరిగి పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించారు. గతంలో రూపొందించిన బదిలీల సీనియారిటీ జాబితాలు సైతం తారుమారయ్యాయి. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు తప్పనిసరిగా బదిలీ అవుతారో కొత్త సవరణల ప్రకారం తిరిగి జాబితాలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా బదిలీల కోసం 5901 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 2102 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారని తాజాగా తేల్చారు. తొలుత బదిలీ జీవోలు జారీ చేసినప్పుడు ఉపాధ్యాయుల స్టేషన్‌ పాయింట్లు, వారి సర్వీస్‌ పాయింట్లు, ప్రధానోపాధ్యాయుల బదిలీకి నిర్దేశించుకున్న అకడమిక్‌ ఇయర్లు వంటివి మార్పులు చేసి నూతన సవరణలు తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రకారం తిరిగి జాబితాలు తయారు చేసినట్లు జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తొలుత బదిలీ జీవోలు ఇచ్చినప్పుడు ఉపాధ్యాయుల సర్వీసుకు సంబంధించి గరిష్ఠంగా 30 ఏళ్లు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చిన సవరణల్లో దీన్ని 32 ఏళ్లకు పెంచడంతో కొందరు ఉపాధ్యాయులకు పాయింట్లు బాగా పెరిగాయి. 

స్టేషన్‌ పాయింట్ల విషయంలోనూ గతంలో గరిష్ఠంగా ఎనిమిదేళ్లకే తీసుకోవాలని నిబంధన ఉంది. దాన్ని ఎత్తివేసి వారు ఎన్ని సంవత్సరాలైతే ఒకే పాఠశాలలో పనిచేశారో ఆ కాలానికి పాయింట్లు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆ మేరకు కొందరికి అదనపు పాయింట్లు వచ్చాయి. ప్రధానోపాధ్యాయుల బదిలీకి అకడమిక్‌ ఇయర్‌ అని తొలుత సూచించారు. కానీ దాన్ని మార్పు చేశారు. వీరికి సంబంధించి 18.11.2015కు ముందు ఏ పాఠశాలలో అయితే పని చేస్తున్నారో అప్పటి నుంచి ఐదేళ్లు పూర్తయితే వారిని బదిలీకి అర్హులుగా పేర్కొంటూ సవరణలు వచ్చాయి. ఈ ప్రకారం తిరిగి అర్హుల జాబితా తయారు చేయగా అదనంగా మరికొందరు ప్రధానోపాధ్యాయులు బదిలీకి అర్హులుగా తేలారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

వెబ్‌ ఆప్షన్‌లకు అవకాశం?

ప్రస్తుతం రూపొందించిన బదిలీల జాబితాను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు పంపి వారి సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతంలో తయారు చేసిన జాబితాలపై సంఘాల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 11 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టనుండడంతో కచ్చితంగా బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు. 

Flash...   Income Tax new web portal 2.0

ప్రధానోపాధ్యాయులు కొందరు బదిలీలపై తమకు విద్యా సంవత్సరం ప్రకారం సర్వీసును ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేపట్టాలని కోర్టును ఆశ్రయించారు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 10 మందికి పైగా ప్రధానోపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వీటిపై కోర్టు ఇచ్చే తీర్పులకు లోబడి బదిలీలు ఉంటాయా? ఉండవా అనేది ఆధారపడి ఉందని మరికొందరు అంటున్నారు. అధికారులు మాత్రం బదిలీల దిశగానే ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు.