నూతన విద్యతో ఉత్తేజపూరిత జ్ఞానం: మోదీ

నూతన విద్యతో ఉత్తేజపూరిత జ్ఞానం
ఈ విధానానికి సరళత, నాణ్యత, జవాబుదారీతనమే పునాదులు: మోదీ
ఆధునిక భారత్‌ వైపు అడుగులు: అమిత్‌ షా
 
న్యూఢిల్లీ, జూలై 29: నూతన విద్యావిధానం-2020 ద్వారా విద్యా వ్యవస్థలో
చాన్నాళ్లుగా అవసరమైన సంస్కరణలను చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని, ఇది మున్ముందు
లక్షల మంది జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ
రోజుల్లో అభ్యసనం, పరిశోధన, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని.. నూతన విద్యావిధానం ఈ
ఉత్తేజపూరిత జ్ఞాన సముపార్జనలోకి దేశాన్ని తీసుకెళుతుందని మోదీ విశ్లేషించారు.
సరళత, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం, అందరికీ అందుబాటులో అనే పునాదులపై నూతన
విద్యావిధానం ఉంటుందన్నారు. ఈ మేరకు నూతన విద్యావిధానానికి ఆమోదం లభించడాన్ని
స్వాగతిస్తూ బుధవారం వరుసగా ట్వీట్లు పెట్టారు. కొత్త విధానం ద్వారా మన దేశం
మరింత మహోజల్వం అవుతుందన్న, సమృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం
చేశారు. 
నూతన విద్యా విధానానికి కేబినెట్‌ ఆమోదం లభించడాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌
షా స్వాగతించారు. ఏ దేశ అభివృద్ధికైనా పునాది విద్యనేనని, గత 34 ఏళ్లుగా ఈ విధానం
కోసం దేశం ఎదురుచూసిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణం దిశగా ఇదో
మైలురాయి అని షా ట్వీట్‌ చేశారు. కాగా కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన
విద్యావిధానం ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు అవకాశం ఏర్పడిందని బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ విధానం యువతలో స్వయం సామర్థ్యాలను,
పెంపొందించి.. ఆధునిక భారతం దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని ట్విటర్‌లో
పేర్కొన్నారు. ఇది దేశానికి చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించారు. మరోవైపు నూతన
విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం అనేది ఏకపక్ష విధానం అని.. భారత విద్యా వ్యవస్థను
నాశనం చేస్తుందని సీబీఐఎం విమర్శించింది. నూతన విద్యావిధానాన్ని అమోదించే క్రమంలో
పార్లమెంటును బైపాస్‌ చేశారని ఆరోపించింది.
Flash...   ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా? క్యాన్సర్‌తో పాటు ఆ రోగాలకు ఛాన్స్!