బంగాళాఖాతంలో ఫాల్ట్‌లైన్.. ఉత్తరాంధ్రకు భూకంపాలు, సునామీ ముప్పు

తూర్పుతీరానికి వంద కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కి.మీ. పొడవున
ఫాల్ట్‌లైన్‌ ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, (ఎన్‌ఐఓ),
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) శాస్త్రవేత్తల అధ్యయనంలో
వెల్లడయ్యింది. ఈ మేరకు పరిశోధనకు సంబంధించిన ఫలితాలను ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌
సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే‘జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌’లో
ప్రచురించారు.
తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు తీరం పొడవునా ఉన్న ఆ చీలిక ఎలా ఏర్పడింది?
దాని పర్యవసానాలేంటి? ముప్పును ఎలా ఎదుర్కోవచ్చనే అంశాలపై శాస్త్రవేత్తలు తదుపరి
అధ్యయనం చేస్తున్నారు. నదుల నుంచి సముద్రంలోకి ప్రవాహాలు చేరే క్రమంలో నీటితోపాటు
మట్టి, రాళ్లు, ఇతర వ్యర్థాలు వస్తుంటాయి. కొన్ని లక్షల ఏళ్లుగా జరిగే ఈ ప్రక్రియ
వల్ల సముద్ర గర్భంపై లక్షలాది టన్నుల అదనపు భారం పడి ఒత్తిడి క్రమంగా పెరుగుతూ
వచ్చింది.
దీంతో నదుల నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి వల్ల సముద్రంలో 22 కి.మీ. ఎత్తున
మేటలు ఏర్పడి, ఒత్తిడి పతాకస్థాయికి చేరడంతో భారాన్ని భరించలేక సముద్రగర్భంలో
భూమి కంపించింది. ఆ ప్రభావానికి సముద్రగర్భంలోని భూమి కొంతభాగం చీలిపోగా.. దాని
లోతు 100 మీటర్ల నుంచి 900 మీటర్ల వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
గోదావరి ప్రాణహిత గ్రాబెన్‌ నుంచి నాగావళి వంశధార షియర్‌జోన్‌ వరకు సుమారు 300
కి.మీ. దూరం భూమి చీలినట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అందులోని రాళ్లు,
మట్టి నమూనాల ఆధారంగా ఈ చీలిక 16 మిలియన్‌ సంవత్సరాల కిందటే ఏర్పడిందని
గుర్తించారు. అలాగే, 6.8 మిలియన్‌ సంవత్సరాల నుంచి 0.3 మిలియన్‌ ఏళ్ల కిందటి వరకు
ఆ చీలిక ప్రాంతంలో అలజడి కొనసాగుతూనే ఉందని తేల్చారు. ఆ మధ్యకాలంలో భూకంపాలు,
సునామీలు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు.
అయితే, 0.3 మిలియన్‌ సంవత్సరాల నుంచి నేటి వరకు చీలిక వల్ల దుష్పరిణామాలు
ఏర్పడినట్ట్ు శాస్త్రవేత్తలు గుర్తించలేదు. చీలికలోకి చేరిన పూడికపై కొత్తగా
వచ్చి చేరే మట్టి, రాళ్లు, ఇసుక వల్ల క్రమంగా ఒత్తిడి పెరుగుతోందని, ఫలితంగా
మళ్లీ భూకంపం వచ్చి అది సునామీకి దారితీయవచ్చునని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
సముద్రగర్భంలో చీలిక ఏర్పడినప్పుడు తీరం వైపు భూభాగం అత్యధికంగా 900 మీటర్ల వరకు
కుంగినట్లు ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Flash...   పతంజలి కరోనా మందుకు బ్రేక్...!
విశాఖ తీరానికి సమీపంలో కుంగుబాటు ఎక్కువగా ఉందని, దాని పర్యవసానాలు నగరంపై పడే
అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఫాల్ట్‌లైన్ కారణంగా భవిష్యత్తులో
ఉత్తరాంధ్రకు భూకంపాలు, సునామీల ముప్పు పొంచి ఉందని, అయితే, అది ఎప్పుడన్నదీ
చెప్పలేమని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. చీలిక భాగం తీరానికి
వంద కి.మీ. దూరంలోనే ఉన్న నేపథ్యంలో ముప్పు తీవ్రత ఎక్కువుగా ఉంటుందని
పేర్కొన్నారు. హెచ్‌సీయూకి చెందిన డాక్టర్‌ ఇస్మాయిల్‌, విశాఖ ఎన్ఐఓకు చెందిన
డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఓఎన్జీసీకి చెందిన డాక్టర్‌ సాహా ఈ అధ్యయనంలో
పాల్గొన్నారు.