GPS Bill : గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. లోపాలను సరిదిద్దిన అనంతరం బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ-ఫైల్ ద్వారా మంత్రులకు బిల్లును సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్పై అస్పష్టతను తొలగించి ప్రతిపాదనలు చేసింది. కుటుంబ పింఛను, కనీస పింఛను ఎలా ఇవ్వాలో బిల్లులో మార్పులు చేశారు. GPS బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలను ఆమోదించి పంపాలని మంత్రులను ప్రభుత్వం ఆదేశించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు జీపీఎస్‌లో కొనసాగేందుకు నిర్ణీత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
ఇటీవల CM JAGAN అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే అందులోని కొన్ని అంశాల్లో మార్పులు చేసి, లోపాలను సరిదిద్దడంతో బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపారు. జీపీఎస్ ముసాయిదా బిల్లుకు కేబినెట్లో మంత్రులు ఆమోదం తెలిపిన అనంతరం రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.GPS లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్-అప్ కోసం ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ఈ బిల్లులో ఉంచింది. అలాగే యాన్యుటీ తగ్గితే కుటుంబ పింఛను, కనీస పెన్షన్ ఎలా ఇవ్వాలనే దానిపై బిల్లులో మార్పులు చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్‌కు మారేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు. ఇలా జీపీఎస్‌పై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టోలో CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో CPS రద్దు కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా GPS ను అమలు చేశారు. ఈ పథకం ద్వారా పింఛను హామీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇల్లు లేని వారికి కచ్చితంగా ఇల్లు ఉండాలని CM Jagan అన్నారు. అది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. పదవీ విరమణ తర్వాత కూడా, ఉద్యోగులు మరియు వారి పిల్లలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కింద ఉండేలా చూసుకోవాలని సూచించారు. తమ పిల్లల చదువులు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కింద అందేలా చూడాలన్నారు.
ఉద్యోగి అసంతృప్తి
మరోవైపు GPS బిల్లుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వాదనలు వినకుండా ప్రభుత్వం మొండిగా GPS బిల్లు తెస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ఇక చేసేదేమీ లేదని సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.GPS విధానంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. జీపీఎస్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. సీపీఎస్ రద్దు చేసిన విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది.